
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం శాసనమండలి ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపిల నేతల మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ప్రతిపక్ష నేతలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉన్నవీ లేనివీ కల్పించి మాట్లాడుతూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ‘మా పార్టీ గెలిస్తే సిఎం కేసీఆర్ రాజీనామా చేస్తారా?’అంటూ సవాళ్ళు విసురుతున్నారు. కేవలం మీడియా, ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రచారయావతో వారు ఇటువంటి అర్ధరహితమైన సవాళ్ళు విసురుతున్నారని నేను భావిస్తున్నాను. ఒకవేళ వారు చెప్పినట్లే చేయాలనుకొంటే, భవానీపూర్ (పశ్చిమ బెంగాల్)లో మమతా బెనర్జీ చేతిలో బిజెపి అభ్యర్ధి ఓడిపోయారు కదా?అప్పుడు ప్రధాని నరేంద్రమోడీ రాజీనామా చేయాలని అడిగితే ఎలా ఉంటుంది?అయినా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సిఎం కేసీఆర్ నేతృత్వంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్ని విజయాలు సాధించిందో అందరికీ తెలుసు. కానీ ఒకటి రెండు ఎన్నికలలో గెలిచినవారు ఇంతగా విర్రవీగడం సరికాదు. రాజకీయాలలో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలి,” అని అన్నారు.