కాంగ్రెస్‌, బిజెపిలు చెడ్డీ గ్యాంగ్స్ వంటివి: గుత్తా

శాసనమండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌, బిజెపిల నేతలు ఇళ్ళలో దొంగతనాలకు పాల్పడే చెడ్డీ గ్యాంగ్ దొంగలవంటివారని అన్నారు. నల్గొండలో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, “చెడ్డీ గ్యాంగ్ వంటి కాశ్, బిజెపిలు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకుతినడం ఖాయం. ఆ రెండు పార్టీల నేతలకు ఎప్పుడూ అధికారయావే తప్ప రాష్ట్రం గురించి ప్రజల గురించి ఆలోచన ఉండదు. రెండు పార్టీల నేతలు రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పగటి కలలుకంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం సిఎం కేసీఆర్‌ చేతుల్లో సురక్షితంగా ఉంది. ఆయన సారధ్యంలోనే రాష్ట్రం అన్ని సమస్యల నుంచి బయటపడి అభివృద్ధిపధంలో దూసుకుపోతోంది. రైతులు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తుంటే పట్టించుకోని బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏమి చేస్తుంది. వారిని పూర్తిగా ముంచేస్తుంది. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ గెలుపు ఎప్పుడో ఖాయం అయిపోయింది. హుజూరాబాద్‌ ప్రజలు ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్‌, బిజెపిలకు గట్టిగా బుద్ది చెపుతారు,” అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.        

టిఆర్ఎస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రాజెక్టుల పేరు చెప్పి ప్రజాధనం దోచుకుతింటోందని కాంగ్రెస్‌, బిజెపిలు ఆరోపిస్తుంటే, గుత్తా సుఖేందర్ రెడ్డి వాటిని చెడ్డీ గ్యాంగ్ దొంగలతో పోల్చడం విశేషం.