గాంధీ జయంతి రోజున రాంగ్ రూట్లో వస్తున్న మంత్రి కేటీఆర్ కారును ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య అడ్డుకొని దానికి చలాన్ వేయడం సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి తరువాత రెండో స్థానంలో ఉన్న మంత్రి కేటీఆర్ వాహనాన్నే అడ్డుకొని చలాన్ వేసినందున ఆయనపై బదిలీవేటు పడుతుందని చాలామంది భావించారు. కానీ మంత్రి కేటీఆర్ ఎస్ఐ ఐలయ్యను, ఆ సమయంలో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును ఈరోజు తన కార్యాలయానికి పిలిపించుకొని వారిని అభినందించారు. వారిరువురూ ధైర్యంగా, నిజాయితీగా విధులు నిర్వర్తించినందుకు మంత్రి కేటీఆర్ వారిని అభినందించి శాలువా కప్పి సన్మానించారు. నిజాయితీగా పనిచేసే మీవంటివారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని మంత్రి కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. తన వాహనానికి వారు విదించిన ట్రాఫిక్ చలానాను కూడా చెల్లించి రశీదు తీసుకొన్నారు.
సామాన్య ప్రజలకైనా, అధికార పార్టీ ప్రజాప్రతినిధులకైనా అందరికీ ఒకే రకమైన నియమ నిబందనలు వర్తిస్తాయని, అందరూ వాటిని ఖచ్చితంగా పాటించాల్సిందేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ కారు తనదే కానీ ఆరోజు దానిలో తాను లేనని, డ్రైవరు దానిని తన కార్యాలయానికి తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగిందని అన్నారు. టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నియమనిబందలకు లోబడి పనిచేసుకోవాలనిచట్టానికి ఎవరూ అతీతులు కారని గుర్తుంచుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.