
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఓ శుభవార్త! వివిద కారణాలతో దీర్గకాలం సెలవు కావాలనుకొనేవారికి ‘అసాధారణ సెలవు’ (ఎక్స్ట్రా ఆర్డినరీ లీవ్ (ఈఓఎల్)కు దరఖాస్తు చేసుకోవచ్చునని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. దీని కింద గరిష్టంగా 5 ఏళ్ళ వరకు (వేతనం లేకుండా) దీర్గకాలపు సెలవు తీసుకోవచ్చు. ఆ తరువాత మళ్ళీ ఉద్యోగంలో చేరవచ్చు. గతంలోనూ దీనిని అమలుచేశారు మళ్ళీ ఇప్పుడు అమలుచేసేందుకు టీఎస్ఆర్టీసీ సిద్దమైంది. చాలామంది ఉద్యోగులు కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్ఆర్టీసీ హటాత్తుగా ‘ఈఓఎల్’ అమలుచేయడానికి చాలా కారణాలే కనిపిస్తున్నాయి.
టీఎస్ఆర్టీసీలో ప్రైవేట్ బస్సులు నడుపుతుండటం, హైదరాబాద్ నగరంలో సుమారు వెయ్యి బస్సుల ఉపసంహరణ వంటి కారణాలతో ప్రస్తుతం టీఎస్ఆర్టీసీలో సుమారు 3,000 మంది డ్రైవర్లు, కండక్టర్లకు పనిలేకుండా పోయింది. ఇదీగాక పదవీ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచడంతో రిటైర్ అవ్వాల్సినవారూ చాలామంది మిగిలిపోయారు. వారిలో చాలామంది ఆరోగ్య సమస్యల కారణంగా విధులు నిర్వహించడానికి ఇబ్బందులు పడుతున్నారు.
టీఎస్ఆర్టీసీకి ఆదాయం ఉన్నా లేకపోయినా వారందరికీ నెలనెలా జీతాలు చెల్లించక తప్పదు. కనుక ‘ఈఓఎల్’ ద్వారా వారందరికీ సెలవు ఇస్తే టీఎస్ఆర్టీసీపై జీతాల భారం తగ్గుతుంది. ఉద్యోగులలో చాలా మంది వివిద కారణాలతో ‘ఈఓఎల్’ కింద దీర్గకాలపు సెలవు తీసుకోవాలని ఎదురుచూస్తున్నారు కూడా. కనుక ఇది వారికీ చాలా సంతోషం కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో టీఎస్ఆర్టీసీ ముందున్న ఇటువంటి ప్రతీ మార్గాన్ని వినియోగించుకొంటే తప్ప కష్టాలు, నష్టాల ఊబిలో నుంచి బయటపడలేదు కనుక ఈ ప్రతిపాదనను స్వాగతించక తప్పదు.