ఎల్బీ, దిల్‌సుక్‌నగర్‌లో హైటెన్షన్... రేపు ఇంకా టెన్షన్

కాంగ్రెస్‌ అధ్వర్యంలో శనివారం ‘విద్యార్ధి నిరుద్యోగ జంగ్ సైరన్’ పేరుతో దిల్‌సుక్‌నగర్‌ నుంచి ఎల్బీ నగర్‌ వరకు చేపట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ర్యాలీకి పోలీసులు అనుమతించకపోయినా భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు తరలిరావడంతో వారిని అడ్డుకొనేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

పోలీసులు అతికష్టం మీద పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆయన భార్య సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్ కుమార్‌ గౌడ్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్తలకు, పోలీసులకు మద్య తీవ్ర వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి. దీంతో ఆ ప్రాంతంలో గంటకు పైగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. 

మరోపక్క ఎల్బీ నగర్‌లో కూడా భారీ సంఖ్యలో ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు తరలిరావడంతో అక్కడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్‌ కళ్యాణ్ అనే కాంగ్రెస్‌ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోబోయాడు. వెంటనే అతని సహచరులు, పోలీసులు అడ్డుకొన్నారు. ఆ తరువాత పోలీసులు అతనిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ ప్రాంతంలో కూడా చాలా సేపు ట్రాఫిక్ జామ్‌ అయ్యింది. 

ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా రేపు నగరంలో సిఎం కేసీఆర్‌ దిష్టి బొమ్మలు దగ్ధం చేయాలని కాంగ్రెస్‌ నేతలు పిలుపునీయడంతో రేపు కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగవచ్చు.