కేసీఆర్‌కు అందుకే నేనంటే మంట: ఈటల

హుజూరాబాద్‌లో ఉపఎన్నికలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న ఈటల రాజేందర్‌ శుక్రవారం జమ్మికుంట మండలంలో గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ సిఎం కేసీఆర్‌, టిఆర్ఎస్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన గ్రామప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఆ మద్య కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని, ఆయన స్థానంలో నన్ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అప్పటి నుండి సిఎం కేసీఆర్‌ మనసులో నా పట్ల అసూయ, ద్వేషం మొదలయ్యాయి. అందుకే ఏదో కుంటిసాకుతో నన్ను బయటకు పంపించారు. 

ఈ ఉపఎన్నికలో నా గెలుపుతో ఆయన భయాలు నిజం కాబోతున్నాయి. నేను గెలిస్తే తెలంగాణ ముఖచిత్రం మారుతుంది. క్రమంగా ప్రగతి భవన్‌, ఫామ్ హౌస్ ఖాళీ అవుతాయి. నా గెలుపు 2023 శాసనసభ ఎన్నికలలో బిజెపి గెలుపుకి నాంది పలుకుతుంది. 2023 ఎన్నికల తరువాత గోల్కొండ కోటపై కాషాయ జెండా రెపరెపలాడబోతోంది. 

నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, పంట రుణాల మాఫీ చేయకుండా దళిత బంధు పధకంతో ఒక్కో కుటుంబానికి పది లక్షలు ఇస్తామని సిఎం కేసీఆర్‌ చెపుతుంటే నమ్మశఖ్యంగా లేదు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా దళితులందరికీ ఆ పధకాన్ని అమలుచేసి నిజయతీ నిరూపించుకోవాలని నేను సవాలు విసిరితే, నేను ఆ పధకాన్ని ఆపివేయమని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ వ్రాశానని టిఆర్ఎస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. 

ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ను గెలిపిచ్చుకొనేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమంగా సంపాదించియా డబ్బును టిఆర్ఎస్‌ విచ్చలవిడిగా ఖర్చు చేస్తోంది. కానీ సిఎం కేసీఆర్‌ ఎని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కోట్లు ఖర్చు చేసినా హుజూరాబాద్‌లో టిఆర్ఎస్‌ ఓడిపోవడం నేను గెలవడం ఖాయం,” అని అన్నారు.