గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ చేతికి బీ-ఫారం

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ అభ్యర్దిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు సిఎం కేసీఆర్‌ నిన్న రాత్రి ప్రగతి భవన్‌లో బీ-ఫారం, ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం పార్టీ తరపున రూ.28 లక్షల చెక్కు ఇచ్చి ఆశీర్వదించారు. హుజూరాబాద్‌ టిఆర్ఎస్‌కు కంచుకోట గనుక భారీ మెజార్టీతో గెలుస్తావని సిఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ఆయనను గెలిపించుకొనేందుకు పార్టీ తరపున మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ పని చేస్తున్నారని సిఎం కేసీఆర్‌ అన్నారు. ప్రజారంజక పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ పధకాలే టిఆర్ఎస్‌కు శ్రీరామరక్ష వంటివని అన్నారు. కనుక హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించి తిరిగి రమ్మని సిఎం కేసీఆర్‌ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ఆశీర్వదించారు. నేడు దశమి మంచి రోజు కనుక గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ నేడు నామినేషన్ వేయనున్నారు.