దళిత బంధు వద్దని నేనెందుకు అంటాను? ఈటల

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న ఈటల రాజేందర్‌ దళిత బంధు పధకం అమలుచేయవద్దని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ వ్రాశారని, దళిత ప్రజలకు మేలు చేసే దళిత బంధు పధకాన్ని వ్యతిరేకిస్తున్న ఆయనకు ఎందుకు ఓట్లు వేయాలంటూ టిఆర్ఎస్‌ నేతలు కొత్త ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై ఈటల రాజేందర్‌ జమ్మికుంటలో మీడియాతో మాట్లాడుతూ, “నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికను తేబట్టే దళిత బంధు పధకం వచ్చిందని, దీంతో నియోజకవర్గంలో దళిత కుటుంబాలకు మేలు కలుగుతుందని మొదటి నుంచి చెపుతున్నాను. కనుక ఈ పధకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అమలుచేయాలని కోరుతున్నాను. మరి అటువంటిది నేనెందుకు దీనిని వ్యతిరేకిస్తాను? టిఆర్ఎస్‌ నేతలే ఓ లేఖను పుట్టించి, దానిని నేనే వ్రాశానని దుష్ప్రచారం చేస్తున్నారు....ధర్నాలు చేస్తూ రాజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటమి భయంతోనే టిఆర్ఎస్‌ నేతలు ఇంత నీచానికి దిగజారారు. అయితే టిఆర్ఎస్‌ ఎన్ని కుట్రలు చేసినప్పటికీ, ఎన్ని వందల కోట్లు వెదజల్లినప్పటికీ అక్టోబర్ 30న జరిగే ఈ ధర్మయుద్ధంలో నేనే గెలుస్తాను. ఈవిషయం సిఎం కేసీఆర్‌ కూడా అర్దమైంది. అందుకే ఇలాంటి చిల్లర పనులను ప్రోత్సహిస్తున్నారు, “ అని అన్నారు.