
హైదరాబాద్‌లో దిశ అత్యాచార, హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించాయో, ఆ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం కూడా అంతే సంచలనం సృష్టించింది. పోలీసులు నిందితులను న్యాయస్థానానికి అప్పగించకుండా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని నిందితులను ఎన్‌కౌంటర్ చేశారంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పందిస్తూ ముగ్గురు సభ్యులతో కూడిన జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమీషన్‌ను నియమించింది. వారు ఇటీవల హైదరాబాద్ వచ్చి ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను, ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని అందరినీ ప్రశ్నిస్తూ నిజానిజాలు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ జరిగినప్పుడు సైబరాబాద్ పోలీస్ కమీషనర్‌గా వీసీ సజ్జనార్ ఉన్నారు.(ప్రస్తుతం టీఎస్‌ఆర్టీసీకి మేనేజింగ్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు) కనుక ఆయన కూడా విచారణకు హాజరుకావలసిందిగా వీఎస్ సిర్పుర్కర్ కమీషన్ ఆదేశించింది. గురు, శుక్రవారాలలో ఆయన విచారణకు కానునట్లు సమాచారం.
దిశ అత్యాచార, హత్య కేసులో నిందితులుగా గుర్తించిన నారాయణ పేట జిల్లా మక్తాల్ మండలంలోని జక్లేర్‌కు చెందిన అరీఫ్, గుడిగండ్ల గ్రామానికి చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్ కుమార్, జొల్లు శివలను పోలీసులు ‘క్రైమ్ సీన్ రీక్రియేషన్’ కోసం ఘటనా స్థలానికి తీసుకువెళ్లినప్పుడు వారు పారిపోయేందుకు ప్రయత్నించారని, ఆ ప్రయత్నంలో పోలీసులు వారిని పట్టుకొనే ప్రయత్నించగా వారు పోలీసులపై కాల్పులు జరిపారని, దాంతో ఆత్మరక్షణకు పోలీసులు ఎదురుకాల్పులు జరపగా నలుగురు నిందితులు మృతి చెందారని పోలీసుల వాదన. అయితే వారిని ఎన్‌కౌంటర్ చేసేందుకే ఆ సమయంలో అక్కడకు తీసుకువెళ్లారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం దీనిపైనే కమీషన్‌కు విచారణ జరుపుతోంది.