హుజూరాబాద్‌లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలు

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల కమీషన్‌ షెడ్యూల్ ప్రకటించినందున నేటి నుంచే కరీంనగర్‌, హన్మకొండ జిల్లాలలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఇప్పటికే ఒకసారి ఈవీఎంల పరిశీలన పూర్తయిందని, నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తరువాత మరోసారి పరిశీలించి ఏవైనా సాంకేతిక లోపాలున్నట్లయితే సరిచేస్తామని చెప్పారు. 

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఎన్‌ఆర్ఐ ఓటర్లతో కలిపి మొత్తం 2,36,430 మంది ఓటర్లున్నారని శశాంక్ గోయల్ తెలిపారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక కోసం 305 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.

టిఆర్ఎస్‌ ప్రభుత్వం చాలా ముందు చూపుతో హుజూరాబాద్‌లోనే దళిత బంధు పధకాన్ని ప్రారంభించి అమలుచేస్తోంది.  కనుక దానికి ఎన్నికల కోడ్ వర్తిస్తుందా లేదా అనేది ఎన్నికల సంఘం స్పష్టం చేయవలసి ఉంటుంది. ఒకవేళ దానిని నిలిపివేసినా ఉపఎన్నికలో దాని ప్రభావాన్ని ఎవరూ అడ్డుకోలేరు. కనుక దాంతో టిఆర్ఎస్‌కు ఓట్ల రూపంలో లబ్ది కలుగవచ్చు. 

మొదట్లో ఈటల రాజేందర్‌ ఉపఎన్నికలో తన గెలుపు పట్ల కాస్త అపనమ్మకంగా మాట్లాడినా, ఇప్పుడు చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుండటం, ఆ ఒక్క సీటు రాకపోయినా టిఆర్ఎస్‌కు నష్టమేమీ లేదని టిఆర్ఎస్‌ మంత్రులు మాట్లాడుతుండటం అక్కడి రాజకీయ బలాబలాలు, పరిస్థితులలో మార్పును సూచిస్తున్నట్లుగా భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌కు ఈటల రాజేందర్‌ గట్టి పోటీనీయబోతున్నారని స్పష్టమవుతోంది.