బిజెపికి ఈటల బలిపశువు మాత్రమే: కౌశిక్ రెడ్డి

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నానని నోరుజారి చేజెతులా ఆ అవకాశాన్ని దూరం చేసుకొన్న పాడి కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “బిజెపికి ఈటల రాజేందర్‌ ఓ బలి పశువు మాత్రమే. అందుకే బలిచ్చే మేకపోతుకు దండ వేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా ఆయనకు దండేసి హుజూరాబాద్‌కు పంపించారు. అయితే ఈటల రాజేందర్‌ ఎన్ని ప్రయత్నాలు చేసిన ఉపఎన్నికలో ఆయన ఓటమి ఖాయం. 

ఈటల రాజేందర్‌కు ముఖ్యమంత్రి అవ్వాలని మనసులో కోరిక లేనట్లయితే ప్రతిపక్షాలు ఆయనను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేస్తున్నప్పుడు మౌనంగా ఎందుకు ఉండిపోయారు?కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై ఆయన ఎందుకు మాట్లాడటం లేదు? నానాటికీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదు? ఈటల రాజేందర్‌ టిఆర్ఎస్‌లో ఉన్నపుడు ఆయనకి కేంద్రప్రభుత్వంలో, బిజెపిలో లోపాలు, వైఫల్యాలు కనబడ్డాయి. కానీ ఇప్పుడు అదే బిజెపిలో ఉన్నందున ఆయనకు అవేమీ ఇప్పుడు కనిపించడం లేదు. కానీ హుజూరాబాద్‌ ప్రజలు మాత్రం కేంద్రప్రభుత్వం, బిజెపి వైఖరిని గమనిస్తూనే ఉన్నారు. కనుక ఈ ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌ను ఓడించి గట్టిగా బుద్ది చెప్పబోతున్నారు. టిఆర్ఎస్‌ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ కనీసం లక్ష ఓట్లు మెజార్టీతో గెలవడం తధ్యం,” అని అన్నారు.