రేవంత్‌ రెడ్డికి సిటీ సివిల్ కోర్టు వార్నింగ్

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి హైదరాబాద్‌ సిటీ సివిల్ కోర్టు సున్నితంగా హెచ్చరించింది. మాదక ద్రవ్యాల కేసులతో ముడిపెట్టి మంత్రి కేటీఆర్‌పై ఎటువంటి విమర్శలు చేయవద్దని హెచ్చరించింది. 

నగరంలో మాదక ద్రవ్యాల సరఫరా, వాడకం పెరిగిపోతుంటే వాటిని అదుపు చేయవలసిన మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ పట్టించుకోవడంలేదని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. తద్వారా మంత్రి కేటీఆర్‌ మాదక ద్రవ్యాల వాడకాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. వైట్‌ ఛాలెంజ్ పేరుతో మంత్రి కేటీఆర్‌, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు  రేవంత్‌ రెడ్డి సవాల్ విసిరారు. ముగ్గురం ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళి మాదకద్రవ్యాల వాడుతున్నామో లేదో తెలుసుకొనేందుకు వైద్య పరీక్షలు చేయించుకొందామని సవాల్ విసిరారు.

దానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సానుకూలంగానే స్పందించారు కానీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ ముందుకు వస్తే ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు తాను సిద్దమని రేవంత్‌ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు.

రేవంత్‌ రెడ్డి రాజకీయ దురుదెశ్యంతోనే ఈ మాదక ద్రవ్యాల వ్యవహారంలో పదేపదే తన పేరును ప్రస్తావిస్తూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాడంటూ మంత్రి కేటీఆర్ సిటీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఆ కేసును నిన్న విచారించిన న్యాయస్థానం రేవంత్‌ రెడ్డిని సున్నితంగా హెచ్చరించింది. మాదక ద్రవ్యాల కేసులతో మంత్రి కేటీఆర్‌ను ముడిపెట్టి ఎటువంటి విమర్శలు, ఆరోపణలు చేయవద్దని న్యాయస్థానం హెచ్చరించింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది.