
వైఎస్సార్‌టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పీర్జాదిగూడాలో నిరుద్యోగ దీక్షకు కూర్చోగా, దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో దీక్ష భగ్నమైంది. ఈ సందర్భంగా ఆమె, ఆమె అనుచరులు పోలీసులతో వాగ్వాదం చేశారు. పోలీసులు ఎంత నచ్చజెప్పిన వైఎస్ షర్మిల దీక్ష విరమించేందుకు ససేమిర అనడంతో మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా తీసుకువెళ్లి కారులో కూర్చోబెట్టి స్టేషన్‌కు తరలించారు. వారిని అడ్డుకొనేందుకు వైఎస్సార్‌టిపి కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టారు.
మరో విశేషమేమిటంటే, ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ వైఎస్ షర్మిల దీక్షకు కూర్చోంటే, అడ్డాకూలీలు ఆమెకు నిరసన తెలుపుతూ అక్కడే ధర్నా చేశారు. ఆమె దీక్షలో కూర్చోంటే రోజుకి రూ.400 చొప్పున ఇస్తామని వైఎస్సార్‌టిపి నేతలు తమను తీసుకువచ్చారని, కానీ తమకు డబ్బు ఇవ్వకుండా పొమ్మని చెపుతున్నారని అడ్డాకూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుతూ దీక్ష చేస్తున్న వైఎస్ షర్మిల తన దీక్షలో పాల్గొంటున్న అడ్డాకూలీలకు డబ్బు చెల్లించకపోవడం ఏమి న్యాయం?