11.jpg)
హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల వ్యవహారాలు, విచారణలపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి మద్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్ పేరుతో విసిరిన సవాలుకి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, ‘జైలుకి వెళ్ళి వచ్చిన రేవంత్ రెడ్డి స్థాయి వ్యక్తిని కాను కనుక రాహుల్ గాంధీ ముందుకు రావాలని’ ప్రతిసవాల్ విసిరారు.
దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “ఆనాడు నగరంలో మాదకద్రవ్యాల కేసును వెలికి తీసి విచారణ జరుపుతున్న ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్‌ను ఎవరిని కాపాడటం కోసం హటాత్తుగా బదిలీ చేశారు? ఆ కేసుల విచారణ ఏమైంది?ఆ వివరాలను ఎక్సైజ్ శాఖ ఎందుకు బయటపెట్టలేదు?ఈడీకి ఎందుకు ఇవ్వడం లేదు?హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ పబ్బుల సంఖ్య పెరిగిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఊరుకొంటోంది? విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్న మాదక ద్రవ్యాలు వాటిలో సరఫరా అవుతుంటే ఎక్సైజ్ శాఖ ఏమి చేస్తోంది?నగరంలో మాదక ద్రవ్యాల సరఫరా, వాడకం పెరిగి వాటితో పిల్లల జీవితాలు పాడవుతుంటే మీకేమీ పట్టదా?మాదక ద్రవ్యాలను అడ్డుకోవాలని నేను కోరుతుంటే నాపై ఎదురుదాడి ఎందుకు చేస్తున్నారు?” అంటూ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.
తన స్థాయి గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడటంపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “నీకు నీవు నీ స్థాయి నాకంటే పెద్దదనుకొంటే సరిపోదు. నువ్వు ఎమ్మెల్యే కాకమునుపే నేను ఎమ్మెల్సీ అయ్యాను. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాను,” అని జవాబిచ్చారు.