
టీఎస్ఆర్టీసీ ఛైర్మన్గా నియమితులైన నిజామాబాద్ రూరల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం ఉదయం హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్దగల బస్ భవన్లో వేదపండితుల ఆశీర్వచనాల నడుమ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ, “టీఎస్ఆర్టీసీని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. నేను కూడా అందరి సహాయసహకారాలతో టీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు గట్టిగా కృషి చేస్తాను,” అని అన్నారు.