
వచ్చే ఏడాది జనవరి 17 నుంచి 21 వరకు ఐదు రోజులపాటు దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం (ప్రపంచ ఆర్ధిక సదస్సు) జరుగబోతోంది. దానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ ఫోరం ప్రెసిడెంట్ బొర్గే బ్రాండ్ తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు.
కరోనా ప్రభావంతో వివిద రంగాలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకోవడం దేశ ఆర్ధిక వ్యవస్థలు దెబ్బ తిన్నాయి. మళ్ళీ అన్ని రంగాలు కోలుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టింది?దాంతో వ్యవస్థలు ఏవిదంగా కోలుకొన్నాయి?అనే అంశంపై సదస్సులో ప్రసంగించవలసిందిగా కోరారు. అలాగే అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకొంది? అనే అంశంపై కూడా సదస్సులో వివరించవలసిందిగా ఫోరం ప్రెసిడెంట్ బొర్గే బ్రాండ్ కోరారు.
ఈ సదస్సుకు తనను ఆహ్వానించినందుకు మంత్రి కేటీఆర్ ఫోరం ప్రెసిడెంట్ బొర్గే బ్రాండ్‌కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక, ఆర్ధిక అభివృద్ధిని, ముఖ్యంగా ఐటి, ఇన్నోవేషన్ రంగాలలో తెలంగాణ సాధిస్తున్న విజయాలను, అనుసరిస్తున్న విధానాలను యావత్ ప్రపంచదేశాలు గుర్తిస్తున్నాయని మరోసారి స్పష్టమైందని మంత్రి కేటీఆర్ అన్నారు.