గణేశ్ నిమజ్జనంపై సుప్రీంకోర్టుకు వెళ్ళబోతున్న తెలంగాణ ప్రభుత్వం

హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌ (పీఓపీ)తో తయారుచేసిన గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి హైకోర్టు అనుమతి నిరాకరించడంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయాలని నిర్ణయించింది. హైదరాబాద్‌ నగరంలో వేలాది గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయవలసి ఉంటుంది. వాటన్నిటి కోసం ఇప్పటికిప్పుడు చెరువులు తవ్వించడం సాధ్యం కాదు. కనుక వాస్తవ పరిస్థితులను, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని హైకోర్టు తీర్పును పక్కన పెట్టి హుస్సేన్‌సాగర్‌లో పీఓపీతో తయారుచేసిన గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అనుమతించవలసిందిగా సుప్రీంకోర్టును కోరాలని సిఎం కేసీఆర్‌ అధికారులకు సూచించినట్లు తాజా సమాచారం. ఒకవేళ సుప్రీంకోర్టు కూడా నిరాకరిస్తే అప్పుడు జీహెచ్‌ఎంసీ ఏమి చేస్తుంది?అప్పటికి తాత్కాలిక చెరువులు ఏర్పాటు చేయడానికి తగినంత సమయం కూడా ఉండదు కదా?అని ఆలోచించవలసిన అవసరం ఉంది.