ఏపీకి బదిలీ అవ్వాలనుకొనేవారికి శుభవార్త

ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాల నుంచి చాలా మంది స్వరాష్ట్రాలకు బదిలీల వెళ్లారు. ఇంకా చాలా మంది బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి బదిలీపై వెళ్లాలనుకొనేవారిని అనుమతిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులతో సహా అన్ని శాఖలలో ఏపీకి బదిలీపై వెళ్ళాలనుకొనేవారు అక్టోబర్ 15వ తేదీలోగా దరఖాస్తులను తమపై అధికారులకు అందజేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఈ బదిలీల కోసం ఉత్తర్వులలో కొన్ని మార్గదర్శకాలు కూడా పేర్కొన్నారు. 

• ఉద్యోగి బదిలీ కోసం దరఖాస్తు చేసుకొన్న తరువాత సంబందిత శాఖల కార్యదర్శులు, శాఖాధిపతుల సిఫార్సు లేఖ, నిరభ్యంతర పత్రాలను ఏపీ ప్రభుత్వానికి పంపించాలి.  

• సదరు ఉద్యోగిని తీసుకొనేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలుపుతూ లేఖను పంపగానే సదరు ఉద్యోగిని విధుల నుంచి రిలీవ్ చేసి, ఉద్యోగి సర్వీస్ రిజిస్టరులో నమోదు చేయాలి.

• ఒకసారి బదిలీ అయిన తరువాత మళ్ళీ వెనక్కు వచ్చేందుకు వీలులేదు. 

• ఏపీకి బదిలీపై వెళ్ళే ఉద్యోగులు, అధికారులకు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి టీఏ, డీఏలు చెల్లించదు. 

• ఏపీకి బదిలీ కోరుకొనేవారు అక్టోబర్ 15వ తేదీలోగా తమ శాఖాధిపతులకు దరఖాస్తులు సమర్పించాలి.