హుజూరాబాద్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించే బాధ్యత సిఎం కేసీఆర్ మంత్రి హరీష్‌రావుకు అప్పగించడంతో ఆయన నియోజకవర్గంలోనే మకాం వేసి ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నారు. అయితే అవి ఎన్నికల వ్యూహాలు కావని ఎన్నికల కుట్రలని ఈటల రాజేందర్ ఆరోపిస్తున్నారు. దీంతో మంత్రి హరీష్‌రావు, ఈటల రాజేందర్ పరస్పరం విమర్శలు, ఆరోపణలు చేసుకొంటున్నారు.
ఈటల రాజేందర్ స్థానిక మధువని గార్డెన్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ, “మంత్రి హరీష్‌రావు సింగపూర్ గెస్ట్ హౌసులో కూర్చొని నన్ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాడు. నా అనుచరులపై పోలీసుల చేత అక్రమ కేసులుబనాయిస్తున్నాడు. కానీ హరీష్‌రావు ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్‌లో గెలిచేది నేనే. ఈ ఉపఎన్నిక కేవలం ట్రైలర్ వంటిదే. ఈ ఉపఎన్నికతోనే టిఆర్ఎస్ పతనం ప్రారంభం అవుతుంది.
నేను సిఎం కేసీఆర్‌ను మోసం చేశానని, దళితుల భూములు దోచుకొన్నానని ఆరోపిస్తూ బలవంతంగా నన్ను బయటకి గెంటి, ఇప్పుడు నేను సిఎం కేసీఆర్‌ను మోసం చేసి బయటకు వచ్చానని హరీష్‌రావు మహిళలకు చెపుతున్నాడు. ఏది నిజమో...ఏది అబద్దమో ప్రజలందరికీ తెలుసు.
నీలాగే నేను కూడా తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాను. కానీ నేను నీలాగ కేసీఆర్ ప్రాపకంతో మంత్రిగా ఎదగలేదు. నా స్వశక్తితో, ప్రజాభిమానంతో ఎదిగాను. నేను ఎటువంటివాడినో ప్రజలందరికీ తెలుసు. కానీ ఇప్పుడు నీవు నాపై ఈవిదంగా చవుకబారు విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే చివరికి నీ పరువే పోతుందని గుర్తుంచుకో,” అని ఈటల రాజేందర్ ఘాటుగా హెచ్చరించారు.