
హుస్సేన్‌సాగర్‌లో పీఓపీ విగ్రహాల నిమజ్జనానికి వీల్లేదని హైకోర్టు ఈరోజు మళ్ళీ తేల్చి చెప్పింది. ఈ అంశంపై హైకోర్టు తీర్పుపై పునర్విచారణ కోరుతూ జీహెచ్‌ఎంసీ వేసిన రివ్యూ పిటిషన్ వేసింది. దానిపై నేడు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన ద్విసభ్యధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. “పరిస్థితులను అర్ధం చేసుకొని మొన్న ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని జీహెచ్‌ఎంసీ తరపు న్యాయవాది లోకేశ్ కుమార్ అభ్యర్ధనపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, “ఇటువంటి పరిస్థితులను చేజెతులా కల్పించుకొంది జీహెచ్‌ఎంసీయే కదా?పీఓపీ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తే నీళ్ళు కలుషితమవుతాయని తెలిసీ దానిలోనే నిమజ్జనం చేయడానికి మమ్మల్ని అనుమతి ఎలా కోరుతున్నారు?చట్టాలను కాపాడవలసిన మేము వాటిని ఉల్లంఘించలేము. ఇంతకు ముందు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరించబోము. జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ సమస్యకు పరిష్కారం కనుగొనకపోవడం వలననే ఈరోజు ఈ సమస్య ఏర్పడింది. కనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీ అధికారులదే,” అని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది.
ప్లాస్టిక్ కవర్ల వినియోగం వలన పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని గుర్తించిన కేంద్రప్రభుత్వం వాటిని దశలవారీగా నిషేధిస్తోంది. అలాగే పీఓపీ విగ్రహాల వలన జలకాలుష్యం జరుగుతుందని జీహెచ్‌ఎంసీకి తెలిసి ఉన్నప్పుడు అసలు పీఓపీ విగ్రహాల తయారీని అనుమతించకుండా ఉంటే ఇప్పుడు ఈవిదంగా హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకొని, బ్రతిమాలుకోవలసిన అవసరం ఉండేదే కాదు కదా?