14.jpg)
తెలంగాణ రాష్ట్రంలో రైతులు వచ్చే యాసంగి సీజనులో వరి పంట వేయడం మానుకొంటే మంచిదని ప్రభుత్వం సూచిస్తోంది. ఆదివారం ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి అధికారుల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. కేంద్రప్రభుత్వం వద్ద మరో 5 ఏళ్ళకు సరిపడా బియ్యం నిలువలు పేరుకుపోయినందున వచ్చే యాసంగి నుంచి ఒక్క కేజీ కూడా దుడ్డుబియ్యం కూడా కొనలేమని స్పష్టం చేసిందని సిఎం కేసీఆర్ అధికారులకు తెలిపారు. కనుక ఈ వర్షాకాల సీజనులో దుడ్డురకం ధాన్యం పెద్దగా కొనుగోలు చేసే అవకాశం లేదని అన్నారు.
రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు పధకం కింద పంట పెట్టుబడి ఇస్తుండటం, కాళేశ్వరం ప్రాజెక్టుతో సంవృద్ధిగా నీటిని అందిస్తుండటంతో రాష్ట్రంలో వరిసాగు పెరిగిందని సిఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గోదాములలో, రైస్ మిల్లర్ల వద్ద సుమారు 70 లక్షల టన్నుల ధాన్యం నిలువలు ఉండగా ఈ వర్షాకాల సీజనులో మరో 1.40 కోట్ల టన్నుల వరి దిగుబడి వస్తుందని అన్నారు. వరి ఉత్పత్తి పెరుగుతోందని తెలిసి ఉన్నప్పుడు కేంద్రప్రభుత్వం ఎగుమతులను, వరి ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించి ఉండి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేదికాదని సిఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
ఈ పరిస్థితులలో వచ్చే యాసంగిలో రైతులు వరి పండించకపోవడమే మంచిదని లేకుంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని అన్నారు. వరికి బదులు వేరుశనగ, మినుములు, పెసలు, పొద్దుతిరుగుడు, కూరగాయలు మొదలైనవి పండించేలా రైతులను ప్రోత్సహించాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీనికోసం ఇప్పటి నుంచే పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని అమలుచేయాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు.