ఇకపై విద్య, వైద్యరంగాల అభివృద్ధి చేసుకొందాం: సిఎం కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎం కేసీఆర్‌ వారితో మాట్లాడుతూ, “గత ఏడేళ్ళలో రాష్ట్రంలో వ్యవసాయం, సాగునీటి రంగాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకొన్నాము. కనుక ఇక నుంచి విద్యా, వైద్య రంగాల అభివృద్ధిపై దృష్టి పెట్టి వాటిని కూడా అభివృద్ధి చేసుకొందాము. 

ముందుగా రాష్ట్రంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ టీకా వేయించాలి. రోజుకు కనీసం మూడు లక్షల మందికి టీకాలు వేయాలి. అలాగే బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాలలో అందరూ విధిగా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి కరోనా జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించేలా చేయాలి లేకుంటే మళ్ళీ మరోసారి రాష్ట్రంలో కరోనా వ్యాపిస్తే దానిని నిర్మూలించడానికి అందరూ చాలా శ్రమపడాల్సి వస్తుంది. 

రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను వీలైనంత వేగంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. అలాగే కొత్త మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషల్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేసుకోవాలి,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు. 

ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.