కేసీఆర్‌ మాయమాటలకు బుట్టలో పడ్డాం: కొండా సురేఖ

ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన కొండా సురేఖ ఏపీ తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఆమె రాజకీయ జీవితం అస్తవ్యస్తంగా మారింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మికంగా హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడంతో కొండా దంపతులు ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిని నమ్ముకొని తెలంగాణ ఉద్యమాలకు దూరంగా ఉండిపోయారు. కానీ రాష్ట్రం విడిపోతున్నట్లు జగన్ గ్రహించగానే, తెలంగాణలో తనను నమ్ముకొన్న కొండా సురేఖ వంటివారిని నడిరోడ్డున వదిలేసి ఆంధ్రాకు వెళ్ళిపోయారు. దాంతో వారి రాజకీయ జీవితాలు అస్తవ్యస్తం అయ్యాయి. 

ఆ తరువాత కేసీఆర్‌ పిలుపు మేరకు కొండా సురేఖ దంపతులు టిఆర్ఎస్‌లో చేరారు కానీ అక్కడా వారికీ సముచిత గౌరవం ప్రాధాన్యం లభించకపోవడంతో తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరుకొన్నారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నానాటికీ బలహీనపడటం వారి పాలిట శాపంగా మారింది. అయినప్పటికీ మళ్ళీ మరో రాజకీయ ప్రయోగానికి సాహసించలేక ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. 

ఇప్పుడు హుజూరాబాద్‌ ఉపఎన్నికలో పోటీ చేయాల్సిందిగా రాష్ట్ర కాంగ్రెస్‌ అధిష్టానం కోరుతుండటంతో ఆమె సానుకూలంగా స్పందించారు కానీ వరంగల్‌ తూర్పు తన సొంత నియోజకవర్గం కనుక వచ్చే ఎన్నికలలో తాను నుంచే పోటీ చేస్తానని అందుకు కాంగ్రెస్‌ ఒప్పుకొంటే హుజూరాబాద్‌ బరిలో దిగుతానని చెప్పారు. 

ఈ సందర్భంగా కొండా సురేఖ సురేఖ రెండు రోజుల క్రితం వరంగల్‌లో తన అనుచరులతో మాట్లాడుతూ,  ఇదివరకు సిఎం కేసీఆర్‌ మాయలో పడి టిఆర్ఎస్‌లో చేరామని కానీ ఆయన తమవంటి బలమైన నేతలను టిఆర్ఎస్‌లోకి ఆకర్షించడం ద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనుకొంటున్నారే తప్ప తమకేమీ ప్రాధాన్యం లేదని గ్రహించలేకపోయామని అన్నారు. ఒకవేళ తనకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే 2018 శాసనసభ ఎన్నికలలో టికెట్ ఇచ్చి మంత్రి పదవి కూడా ఇచ్చి  ఉండేవారని కానీ కేసీఆర్‌ దృష్టిలో తాము రాజకీయ పావులం మాత్రమేనని అన్నారు. ఈ విషయం గ్రహించి తాము టిఆర్ఎస్‌ నుండి బయటపడ్డామని కొండా సురేఖ అన్నారు.