హుజూరాబాద్‌లో పోటీ చేస్తా కానీ... కొండా సురేఖ

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌, ఈటల రాజేందర్‌ (బిజెపి)ల మద్య ప్రధానంగా పోరు జరుగబోతోంది కనుక వాటి మద్యలో ప్రవేశించేందుకు ఎవరూ సిద్దపడటం లేదు. కాంగ్రెస్ పార్టీలో 18 మంది ఆశావహులు హుజూరాబాద్‌ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకొన్నప్పటికీ వారెవరూ టిఆర్ఎస్‌, బిజెపి అభ్యర్ధులకు పోటీ ఇవ్వలేరు కనీసం డిపాజిట్లు దక్కించుకోలేకపోవచ్చు. కనుక హుజూరాబాద్‌లో కొండా సురేఖను బరిలో దించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోంది. అందుకు ఆమె సముఖత వ్యక్తం చేసినప్పటికీ, వచ్చే శాసనసభ ఎన్నికలలో తాను వరంగల్‌ నుంచే పోటీ చేస్తానని షరతు విధించారు. అలాగే తాము కోరినవారికి కొన్ని టికెట్లు కూడా ఇచ్చేందుకు అంగీకరిస్తేనే హుజూరాబాద్‌ బరిలో దిగుతానని కొండా సురేఖ చెప్పారు. 

అయితే బరిలో దిగక మునుపే తాను హుజూరాబాద్‌ కంటే వరంగల్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పడం, టిఆర్ఎస్‌, బిజెపిలకు ఆయుధంగా మారుతుంది. ఇక్కడ ఉండటానికి ఇష్టపడని వ్యక్తికి ఓట్లేయడం ఎందుకని టిఆర్ఎస్‌, బిజెపిలు నిలదీయకమానవు. ఇది హుజూరాబాద్‌ ఓటర్లను కూడా ఆలోచింపజేస్తుంది కనుక ఆమెకు ఓట్లు వేయకపోవచ్చు. ఈవిషయం కూడా ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆమె శాసనసభ ఎన్నికల వరకు పూర్తిగా హుజూరాబాద్‌కే అంకితమవుతానని, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు హామీ ఇవ్వాలని ఆమె కోరారు.