నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో ఇక మహిళలకు ప్రవేశం

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్‌డీఏ) ద్వారా సాయుధ బలగాలలోకి మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఎన్‌డీఏలో మహిళలకు ప్రవేశం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన ఓ పిటిషన్‌పై నిన్న విచారణ జరిగినప్పుడు కేంద్రప్రభుత్వం తరపు హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి న్యాయస్థానికి ఈవిషయం తెలియజేశారు. ఎన్‌డీఏలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ శాశ్విత కమీషన్‌కు కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని ఆమె తెలియజేశారు. ఎన్‌డీఏలో మహిళల ప్రవేశంపై కేంద్రప్రభుత్వం త్రివిధ దళాధిపతులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకొందని తెలిపారు. దీనికి సంబందించి పూర్తి వివరాలను సమర్పించేందుకు కొంత సమయం కావాలని ఆమె సుప్రీంకోర్టును అభ్యర్ధించగా సానుకూలంగా స్పందించింది. తమ జోక్యం లేకుండానే కేంద్రప్రభుత్వం ఇటువంటి మంచి నిర్ణయం తీసుకొన్నందుకు అభినందిస్తున్నామని సుప్రీంకోర్టు హర్షం వ్యక్తం చేసింది. 

యూపీపీఎస్సీ ద్వారా ఎన్‌డీఏలో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఇప్పుడు ఎన్‌డీఏ ద్వారా సాయుధ బలగాలలో మహిళలకు ప్రవేశం కల్పిస్తున్నందున ఇంటర్ పూర్తిచేసిన యువతులకు భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి.