
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. తాలిబన్ నేత ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ దేశ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబన్ల పోరాటాలలో కీలకపాత్ర పోషించిన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్, మౌల్వీ హనాఫీలు ప్రధానికి డెప్యూటీలుగా వ్యవహరిస్తారు. మొత్తం 33 మంది మంత్రులతో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే ఇది తాత్కాలిక ప్రభుత్వమేనని, దేశంలో అన్ని ప్రాంతాలకు భాగస్వామ్యం కల్పిస్తూ త్వరలో శాశ్విత ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్న ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ గతంలో తాలిబన్ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, విదేశాంగమంత్రిగా పనిచేశారు. తాలిబన్ నాయక మండలిలో కీలక వ్యక్తిగా తాలిబన్ల వ్యవహారాలు చక్కపెడుతుండేవారు.
తాలిబన్ల పోరాటాలలో కీలకపాత్ర పోషించిన కారీ ఫసీహుద్దీన్ బదక్షానీని సైన్యాధ్యక్షుడిగా నియమించుకొన్నారు. అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న సిరాజుద్దీన్ కరడుగట్టిన తీవ్రవాది. హక్కానీ నెట్వర్క్ అధినేత. అల్-ఖైదాతో బలమైన సంబంధాలున్నాయి. అమెరికా ఇతనిని సజీవంగా లేదా ఇతని శవాన్ని అప్పగించినవారికి ఐదు మిలియన్ డాలర్లు బహుమతి ప్రకటించింది.
కరడు గట్టిన నరహంతక ముఠా తాలిబన్ల గురించి కొత్తగా చెప్పుకోవలసింది ఏమీ లేదు. వారిని చూసి ఆఫ్ఘన్ ప్రజలు ముఖ్యంగా...మహిళలు భయంతో దేశం విడిచి పారిపోతున్నారు. ఇప్పుడు వారితోనే ప్రపంచదేశాలన్నీ దౌత్యసంబంధాలు నెరపవలసి ఉంటుంది.