టిఆర్ఎస్‌కు కేటీఆర్‌ కొత్త నిర్వచనం

తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన మంగళవారం జలవిహార్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని టిఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ కాంగ్రెస్‌, బిజెపిలపై వాటి అధ్యక్షులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “సిఎం కేసీఆర్‌ పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించడం వలననే తెలంగాణ కాంగ్రెస్‌, తెలంగాణ బిజెపిలు వాటికి నాయకులు పుట్టుకొచ్చారు. కనుక వారి పదవులు, పార్టీలు సిఎం కేసీఆర్‌ పెట్టిన భిక్షే. కానీ నిన్నమొన్న పుట్టుకొచ్చిన ఆ పార్టీల నేతలు తమ కంటే వయసులో, రాజకీయ అనుభవంలో ఎంతో సీనియర్ అయిన సిఎం కేసీఆర్‌నుద్దేశ్యించి నిత్యం అవాకులు చవాకులు వాగుతున్నారు. చిల్లరగాళ్ళలాగ వ్యవహరిస్తూ వారి జాతీయపార్టీల పరువు కూడా తీస్తున్నారు. ఇక నుంచి వారు ఇష్టం వచ్చినట్లు వాగితే బలంగా తిప్పికొడతాము. 

పేరుగొప్ప జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బిజెపిలు డబ్బై ఏళ్ళలో ఏమీ సాధించలేకపోయాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వమైతే కనీసం విద్యుత్ సమస్యను కూడా పరిష్కరించలేకపోయింది. కానీ తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపారు సిఎం కేసీఆర్‌. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, అమలవుతున్న సంక్షేమ పధకాలను చూసి ఓర్వలేక, ఏమీ చేయలేకనే కాంగ్రెస్‌, బిజెపి నేతలు సిఎం కేసీఆర్‌ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ పైశాచికానందం పొందుతున్నారు. అయితే సిఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రజలు టిఆర్ఎస్‌ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. కనుక ప్రతిపక్షాలకు ప్రజలే తగిన గుణపాఠం చెపుతారు. ప్రజలందరూ మనవైపు ఉన్నందున హుజూరాబాద్‌ ఉపఎన్నిక మనకు అసలు సమస్యే కాదు. మనకు 60 లక్షల మంది పార్టీ కార్యకర్తలున్నారు. టిఆర్ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని అర్ధం. కనుక పార్టీని అంతర్గతంగా మరింత పటిష్టం చేసుకొంటూ ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొంటుండాలి,” అని కేటీఆర్‌ అన్నారు.