వర్షంలో తడుస్తూనే బండి సంజయ్ పాదయాత్ర

గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు నాలుగు రోజులు ఇలాగే వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయినప్పటికీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ మొదలుపెట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర ఆపలేదు. సోమవారం పదోరోజు వికారాబాద్‌ జిల్లాలో మోమిన్‌పేట నుంచి మెకవనంపల్లి వరకు ఒక కిమీ పాదయాత్రతో 100 కిమీ పూర్తిచేసారు. ఈ సందర్భంగా బిజెపి యువమోర్చా తరపున బండి సంజయ్‌ చేత 100 కిలోల కేక్ కట్ చేయించారు. 

అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లాలో ప్రవేశించిన బండి సంజయ్‌కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బిజెపి నేతలు ఘనస్వాగతం పలికి ఆయనతో పాటు సదాశివపేటలోని గాంధీ చౌక్ వరకు వర్షంలో తడుస్తూనే 7 కిమీ పాదయాత్ర చేశారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో బండి సంజయ్‌ ప్రసంగిస్తూ సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.