
పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాలలో విజయవంతంగా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోర సభలు నిర్వహించింది. ఈసారి సిఎం కేసీఆర్ కంచుకోట గజ్వేల్లోనే ఈనెల 17న దండోరా ముగింపు సభ, ఆలోపుగా కరీంనగర్ జిల్లాలో కూడా ఓ దండోరా సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆదివారం గాంధీభవన్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమయ్యి ఈ నిర్ణయం తీసుకొన్నారు. దసరా పండుగ తరువాతే హుజూరాబాద్ ఉపఎన్నిక జరుగుతుందని స్పష్టం అయినందున, కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపిక విషయంలో తొందరపాటు అవసరం లేదని నిర్ణయించారు.
నిన్న జరిగిన సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు జె.గీతారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్, ఏఐసీసీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, “హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే సిఎం కేసీఆర్ దళిత బంధు పధకం ప్రకటించారు. కానీ అది వికటించడంతో టిఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకొంది. అందుకే కరోనా, పండుగల సీజన్ సాకులు చూపి హుజూరాబాద్ ఉపఎన్నికను వాయిదా వేయించింది. దళిత బంధు పధకమే టిఆర్ఎస్ కొంప ముంచబోతోంది. టిఆర్ఎస్, బిజెపిల మద్య రహస్య అవగాహన ఉందని సిఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనతో మరోసారి రుజువైంది. రాష్ట్ర బిజెపి నేతలు వారి అధిష్టానం, సిఎం కేసీఆర్ కలిసి ఆడుతున్న చదరంగంలో పావులుగా మిగిలిపోయారు,” అని అన్నారు.