టీఎస్‌ఆర్టీసీని అందరం కలిసి కాపాడుకొందాం: సజ్జనార్

టీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టరుగా నియమితులైన వీసీ సజ్జనార్ శుక్రవారం బస్ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీ స్వావలంబన, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సంతృప్తి తన ప్రధాన లక్ష్యాలన్నారు. కరోనా, లాక్‌డౌన్‌, నానాటికీ పెరుగుతున్న డీజిల్, వాహనాల విడిభాగాల ధరలు శాపంగా మారి టీఎస్‌ఆర్టీసీని క్రుంగదీశాయన్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోతున్న టీఎస్‌ఆర్టీసీని ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోందని, ఇక నుంచి తాను కూడా అధికారులు, కార్మికుల సహాయసహకారాలతో టీఎస్‌ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తామని సజ్జనార్ అన్నారు. ప్రస్తుతం టీఎస్‌ఆర్టీసీకి కార్గో, పార్సిల్ సర్వీసుల ద్వారా ఎక్కువగా ఆదాయం వస్తోందని, ఇక నుంచి ఆదాయం పెంచుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని అన్నారు. అమ్న్దరూ కలిసికట్టుగా పనిచేస్తే టీఎస్‌ఆర్టీసీని తప్పకుండా కాపాడుకోగలమనే నమ్మకం తనకుందని సజ్జనార్ అన్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘానేతలు, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సజ్జనార్ రవాణాశాఖ కార్యాలయానికి వెళ్ళి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను  కలిసి తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.