
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని మళ్ళీ పెంచింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుగా దీనిని 2006-2007లో మొదలుపెట్టినప్పుడు దీని అంచనా వ్యయం రూ.17,875 కోట్లు కాగా తరువాత దానిని రూ.38,500 కోట్లకు పెంచాయి అప్పటి ప్రభుత్వాలు.
తెలంగాణ ఏర్పడిన తరువాత నీటి లభ్యత, రాష్ట్ర అవసరాలకు తగ్గట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసి అంచనా వ్యయాన్ని రూ.89,190 కోట్లకు పెంచింది. ఇటీవల కేంద్ర జలసంఘానికి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ప్రాజెక్టు సమగ్ర నివేదికలో మళ్ళీ సవరించిన అంచనా వ్యయాన్ని సమర్పించింది. దాని ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం మరో రూ. 30,435.97 కోట్లు పెరిగింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.11 లక్షల కోట్లకు చేరుకొంది.
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు మేడిగడ్డ నుంచి రోజుకు రెండు టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోసుకొనేందుకు తగ్గట్లుగా ఆ అంచనా వ్యయం లెక్కగట్టింది. దాంతో రాష్ట్రంలో కొత్తగా 18.65 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు మరో 18.82 లక్షల ఆయకట్టు స్థిరీకరించాలని నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు భాగంగా మొత్తం 18 జలాశయాలు నిర్మించి వాటిలో 14 టీఎంసీలు నీళ్ళు నిలువచేయాలని నిర్ణయించింది.
కానీ ఆ తరువాత మేడిగడ్డ నుంచి అదనంగా మరొక టీఎంసీ నీళ్ళు తోడిపోసి జలాశయాలలో 141 టీఎంసీల నీళ్ళు నిలువచేయాలని నిర్ణయించడంతో ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా భారీగా పెరిగింది. ఇదీగాక కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు ఉన్న సిమెంట్, స్టీలు, ఇందనం ధరలతో పోలిస్తే ఇప్పుడు వాటి ధరలు చాలా పెరిగాయి. కనుక ప్రాజెక్టు అంచనా వ్యయం మరో రూ. 30,435.97 కోట్లకు పెంచక తప్పలేదని రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సమగ్ర నివేదికలో పేర్కొంది.