
మంత్రి హరీష్‌రావు మంగళవారం హుజూరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంటలో మీడియాతో మాట్లాడుతూ, “హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఉనికే లేదు కనుక ఉపఎన్నికలలో మాకు బిజెపితోనే పోటీ ఉంటుంది. బిజెపి రైతువ్యతిరేకి అయితే టిఆర్ఎస్ రైతు బంధు. సిఎం కేసీఆర్ తెలంగాణలో రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 365 రోజులు ఉచితంగా సాగునీరు అందిస్తున్నారు. ఉచితంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారు. రైతు బంధు, రైతు భీమా అందిస్తున్నారు. ఎక్కడికక్కడ రైతు వేదికలు నిర్మింపజేస్తున్నారు.
కానీ కేంద్రప్రభుత్వం (బిజెపి) రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చింది. ఎరువుల ధరలు పెంచేస్తోంది. మార్కెట్లో యార్డులు రద్దు చేస్తోంది. మద్దతుధర కోరితే రైతులపై పోలీసులతో దాడులు చేయించింది. కేంద్రప్రభుత్వం రైతువ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వేలాదిమంది రైతులు అనేక నెలలుగా ఢిల్లీ శివార్లలో ఆందోళనలు చేస్తున్నారు. వారి గోడు పట్టించుకోకుండా వారిపై పోలీసులతో దాడి చేయిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తుంటే, కేంద్రప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని ఒత్తిడి చేస్తోంది. ఇటువంటి రైతు వ్యతిరేక పార్టీకి ఓటేయాలా లేదా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న టిఆర్ఎస్కు ఓటేయాలా? అని హుజూరాబాద్ ప్రజలే ఆలోచించుకోవాలి.
ఈటల రాజేందర్ కాషాయ పార్టీలో ఉంటూ ఎర్రపార్టీ (కమ్యూనిస్ట్) మాటలు మాట్లాడుతున్నారు. ఇది ప్రజలను మభ్యపెట్టడానికే. కనుక ప్రజలు ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తొమ్మిది నెలల క్రితం దుబ్బాకలో రఘునందన్ రావు (బిజెపి)ను గెలిపిస్తే ఇంతవరకు ఆయన మళ్ళీ ఆ నియోజకవర్గంవైపు తొంగి చూడలేదు. ఈటల రాజేందర్‌ను గెలిపిస్తే ఇక్కడా అలాగే జరుగుతుంది. కనుక నియోజకవర్గం అభివృద్ధి కోసం టిఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కే ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.