సిఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన ఖరారు

ఢిల్లీలో టిఆర్ఎస్‌ పార్టీ కార్యాలయం నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో వసంత్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో 1300 గజాల విస్తీర్ణంలో దీనిని నిర్మించబోతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన సిఎం కేసీఆర్‌ దానికి భూమిపూజ చేస్తారు. ఆ కార్యక్రమానికి ఇంకా రెండు రోజులే ఉన్నందున ఈరోజు ఆయన ఢిల్లీ పర్యటన ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. 

సిఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన షెడ్యూల్: సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరుతారు. ఆరోజు రాత్రి తెలంగాణ భవన్‌లో బస చేసి మర్నాడు మధ్యాహ్నం 12.30 గంటలకు వసంత్ విహార్ చేరుకొని భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్‌ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం మళ్ళీ హైదరాబాద్‌ తిరుగుప్రయాణం అవుతారు. దీని నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే దక్షిణాది ప్రాంతీయ పార్టీలలో ఢిల్లీలో కార్యాలయం కలిగిన ఏకైక పార్టీ టిఆర్ఎస్‌ అవుతుంది.