
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగంలో కూడా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అగ్రి ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటుచేశారు. దీని కోసం నాబార్డ్ రూ. 9 కోట్లు ఆర్ధిక సాయం అందజేసింది. దీనిలో 14 స్టార్టప్ కంపెనీలు ఏర్పాటుకానున్నాయి. అవి వ్యవసాయంలో రైతులు నిత్యం ఎదుర్కొనే అనేక సమస్యలకు పరిష్కారాలను కనిపెట్టడం, వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను ప్రవేశపెట్టడం చేస్తాయి. అలాగే వ్యవసాయం, మార్కెటింగ్ రంగాలకు సంబందించిన అన్ని వివరాలు (డేటా), పుస్తకాలు ఇక్కడి గ్రంధాలయంలో అందుబాటులో ఉంటాయి.
ఈ అగ్రి హబ్‌ను రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కలిసి సోమవారం ప్రారంభించారు. త్వరలోనే దీనికి జగిత్యాల, వరంగల్, వికారాబాద్ జిల్లా కేంద్రాలలో ప్రాంతీయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి వాటిద్వారా ఈ అగ్రిహబ్ కార్యకలాపాలను, సేవలను జిల్లాలకు విస్తరిస్తారు.