బండి ఆరోపణలను కేంద్రం పట్టించుకోదేమి?ఠాగూర్ ప్రశ్న

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ ఛార్జ్ మానిక్కం ఠాగూర్ ఆదివారం కరీంనగర్‌లో పార్టీ నేతలతో సమావేశమయ్యి హుజూరాబాద్‌ ఉపఎన్నికకు పార్టీ అభ్యర్ధిగా ఎవరిని బరిలో దింపాలనే దానిపై వారి అభిప్రాయాలు తీసుకొన్నారు.

తరువాత మీడియాతో మాట్లాడుతూ, “టిఆర్ఎస్‌, బిజెపిలు రెండూ పైకి వేర్వేరుగా కనిపిస్తున్నా అవి నాణేనికి బొమ్మబొరుసు వంటివి. రెంటి మద్య రహస్య అవగాహన ఉంది. అందుకే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌తో సహా రాష్ట్ర బిజెపి నేతలు సిఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు...వారి ప్రభుత్వంపై ఎన్ని అవినీతి ఆరోపణలు చేస్తున్నా కేంద్రప్రభుత్వం పట్టించుకోదు. కేంద్రప్రభుత్వం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోయినా బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తూ ఇంకా ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. కనుక ఆ పాదయాత్ర వలన ఎటువంటి ఉపయోగం లేదు. టిఆర్ఎస్‌ కూడా రాష్ట్ర బిజెపి నేతలతో యుద్ధం చేస్తున్నట్లు నటిస్తుంటుంది. రెండు పార్టీలు ఈవిదంగా నాటకాలు ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నాయి. కనుక హుజూరాబాద్‌ ఉపఎన్నికలో ప్రజలే వాటికి తగినవిదంగా బుద్ది చెప్పాలి,” అని అన్నారు. 

మానిక్కం ఠాగూర్‌ వాదన సహేతుకంగానే ఉంది. అయితే ఆ రెండు పార్టీలను కాదని హుజూరాబాద్‌ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్ధికే ఎందుకు ఓటువేయాలో చెప్పి ఉంటే బాగుండేది. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ దక్కించుకోవాలని టిఆర్ఎస్‌ విసురుతున్న సవాళ్ళపై మానిక్కం ఠాగూర్ స్పందించి ఉంటే బాగుండేది. అన్నిటి కంటే ముఖ్యంగా కాంగ్రెస్‌ అభ్యర్ధి పేరును ఇంకా ఎప్పుడు ప్రకటిస్తారో చెప్పాలి.