హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రామచంద్రరావు

తెలంగాణ హైకోర్టు ఇన్‌చార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సత్యరత్న రామచంద్రరావు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ హిమ కొహ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అవుతున్నారు. కనుక ఆమె స్థానంలో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రామచంద్ర రావుకు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. 

జస్టిస్ రామచంద్రరావు హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. 1989లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్‌బి పట్టా పొందారు. ఆ తర్వాత కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ఎం పట్టా పొందారు.1989 నుంచి న్యాయవాదిగా పని చేస్తున్నారు. ఆయన ఇదివరకు ఎస్బీఐ, ఎస్బీహెచ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, రాష్ట్ర ఆర్థిక సంస్థ తదితర సంస్థలకు న్యాయవాదిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు.