బండి సంజయ్‌ పాదయాత్ర దేనికో? కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించనున్నారు. దీనిపై మంత్రి, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందిస్తూ, “బండి సంజయ్‌ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలి. కేంద్రప్రభుత్వం గొప్పగా ప్రారంభించిన మేకిన్ ఇండియాను సేల్ ఇండియాగా మార్చేసి ఆరు లక్షల కోట్లు విలువగల కేంద్రప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రధాని నరేంద్రమోడీ, ఇప్పుడు వాటిలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికులను రోడ్డున పడేస్తున్నారు. కేంద్రప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవడం కోసం మౌలాలీలో విలువైన రైల్వే భూములు అమ్ముకొంటోంది. నీతి ఆయోగ్ చెప్పినా మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ కార్యక్రమాలకు కేంద్రప్రభుత్వం పైసా విదిలించలేదు. కనీసం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని సిఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోలేదు. 

కేంద్రప్రభుత్వం సహకరించకపోయినా సిఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్నివిదాలా అభివృద్ధి చేసుకొంటున్నాము. దళిత బంధు పధకం వంటి అనేక సంక్షేమ పధకాలను అమలుచేస్తున్నాము. రాష్ట్రంలో అమలుచేస్తున్న పధకాలలో ఏ ఒక్కటైనా బిజెపి పాలిత రాష్ట్రాలలో అమలుచేయగలిగారా?బండి సంజయ్‌ సమాధానం చెప్పాలి. ప్రశాంతంగా అభివృద్ధిపధంలో సాగిపోతున్న రాష్ట్రంలో పాదయాత్రల పేరుతో ప్రజల మద్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు,” అని ఆరోపించారు.