నేటి నుంచి బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నేటి నుంచి ప్రజా సంగ్రామ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈరోజు ఉదయం బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీతో బయలుదేరి నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి చేరుకొంటారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ పాతబస్తీ చేరుకొంటారు. అక్కడ ఛార్మినార్ వద్దగల భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసిన తరువాత పాదయాత్ర ప్రారంభిస్తారు. 

ఈ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శులు అరుణ్ సింగ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్ చుగ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రమేశ్ బిదురి, రాష్ట్ర బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు. రోజుకి 10-15 కిమీ చొప్పున రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల గుండా ఈ ప్రజాసంగ్రామ పాదయాత్ర సాగుతుంది. తరుణ్ చుగ్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభిస్తారు.    

తొలిరోజు పాదయాత్రలో మదీనా, బేగమ్ బజార్ మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేరుకొంటారు. అక్కడి నుంచి గన్‌ పార్కు చేరుకొని అమరవీరులకు నివాళులు ఆర్పిస్తారు. ఆ తరువాత సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్, డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి బయలుదేరుతారు. లక్డీకపూల్, మసాబ్ ట్యాంక్, మోహిదీపట్నం వరకు పాదయాత్ర చేసి రాత్రి స్థానిక పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీలో బస చేస్తారు.      

ప్రజల మద్యకు వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడుతానని బండి సంజయ్‌ అన్నారు.