చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతా: కేసీఆర్‌

సిఎం కేసీఆర్‌ ఈరోజు కరీంనగర్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా మంత్రులు, కలెక్టర్‌ అధికారులతో దళిత బంధు పధకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏవిదంగా ప్రాణాలు పణంగా పెట్టి పోరాడానో. అదేవిదంగా దళిత బంధు పధకాన్ని విజయవంతం చేసేందుకు ఎన్ని అవరోధాలు ఎదుర్కోవలసి వచ్చినా ఎదుర్కొంటూ నా చివరి రక్తం బొట్టు వరకు పోరాడుతాను. సమాజంలో అట్టడుగుస్థాయిలో ఉన్న దళితులను పైకి తీసుకువచ్చేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు తీర్చుకొన్నాము. గాడి తప్పిన వ్యవస్థలన్నిటినీ మళ్ళీ చక్కదిద్దుకొన్నాము. తెలంగాణ ఏర్పడినప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాము. అన్ని వర్గాల ప్రజల కొరకు సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్నాం. ఇప్పుడు ఈ దళిత బంధు పధకాన్ని కూడా అదే విదంగా విజయవంతం చేసుకోవాలి. అది మన బాధ్యత కూడా,” అని అన్నారు. 

 దళిత బంధు విజయవంతం కావడమనేది రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపైనే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఆ తరువాత దానిని ఎంత సమర్ధంగా, పారదర్శకంగా అమలుచేస్తున్నారనేది ముఖ్యం. ఇది హుజూరాబాద్‌  ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని ప్రకటించింది కాదని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలుచేస్తామని సిఎం కేసీఆర్‌ స్వయంగా చెపుతున్నారు కనుక ఈ పధకాన్ని ఏ కారణంతో నిలిపివేయడానికి లేదా వాయిదా వేయడానికి వీలులేని పరిస్థితి స్వయంగా కల్పించుకొన్నట్లే చెప్పవచ్చు. కనుక రాష్ట్రవ్యాప్తంగా ఈ పధకాన్ని దశలవారీగా అమలు చేయాలన్నా దానికి సరిపడినన్ని నిధులు సమకూర్చుకోవడం ఓ మహాయజ్ఞమనే చెప్పాలి.

దళిత బంధుతో టిఆర్ఎస్‌ ప్రతిపక్షాలపై రాజకీయంగా పైచేయి సాధించాలనుకొంటోంది కనుక ప్రతిపక్షాలు కూడా టిఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు బీసీ బంధు, గిరిజన బంధు, మైనార్టీ బంధు వంటి పధకాలు ప్రకటించాలని ఒత్తిడి చేస్తున్నాయి. కనుక ఈ విషయంలో వాటిని తప్పు పట్టడానికి లేదు. 

ఈ బంధు ఆలోచన గత ఏడు దశాబ్ధాలలో మరెవరికీ రాలేదని, తనకే వచ్చిందని సిఎం కేసీఆర్‌ సగర్వంగా చెప్పుకొంటున్నారు కనుక ఈ ఒత్తిళ్ళన్నిటినీ తట్టుకొంటూ ఈ పధకాన్ని విజయవంతం చేసేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడక తప్పదు.