సిఎం కేసీఆర్‌ మరో అంబేడ్కర్: మంత్రులు

మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్ ఈరోజు కరీంనగర్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద నలుగురు లబ్దిదారులకు దళిత బంధు పధకం కింద ట్రాక్టర్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, “దళిత బంధు పధకం ప్రకటించి అంతే చిత్తశుద్ధితో దానిని అమలుచేస్తూ రాష్ట్రంలో దళితుల జీవితాలలో వెలుగులు నింపుతున్న సిఎం కేసీఆర్‌ దళితుల పాలిట మరో అంబేడ్కర్ అయ్యారు. అణగారిన వర్గాల గురించి కూడా మానవతాదృక్పదంతో ఆలోచించి వారి కోసం ఈ పధకాన్ని ప్రవేశపెట్టి వారి హృదయాలలో దేవుడై కొలువయ్యారు. సిఎం కేసీఆర్‌ మాటల మనిషి కాదు చేతల మనిషని మరోసారి చాటుకొన్నారు,” అని అన్నారు.

ఇటువంటి ఒక గొప్ప పదకంతో తాము లబ్ది పొందుతామని ఎన్నడూ ఊహించని లబ్దిదారులు సహజంగానే సంతోషంతో ఉప్పొంగిపోతూ తమ జీవితాలలో వెలుగులు నింపిన దేవుడు సిఎం కేసీఆర్‌ అని కృతజ్ఞతలు తెలుపుకున్నారు.


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో టిఆర్ఎస్‌ నేతలు సిఎం కేసీఆర్‌ను ‘తెలంగాణ గాంధీ’ ‘తెలంగాణ పిత’ అంటూ అభివర్ణించేవారు. ఇప్పుడు సిఎం కేసీఆర్‌ను డాక్టర్ అంబేడ్కర్‌గా అభివర్ణిస్తున్నారు. ఎంతటివారైనా మహనీయులు చూపిన మార్గంలో నడవాలే తప్ప తామే మహనీయులమనుకోరాదు. మహనీయులను సమాజమే గుర్తించి గౌరవిస్తుంది కనుక నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేసుకుపోతే చాలు మహనీయులమని చాటింపు వేసుకోనవసరం లేదు. అయినా ఎవరికివారు తమ సొంత గుర్తింపు పొందాలే తప్ప మహనీయుల నీడగా మిగిలిపోకూడదు.