మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ జమ్మికుంటలో తన ఇంట్లో నిన్న మీడియాతో మాట్లాడుతూ సిఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ వైఖరిలో మార్పుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“నేను రాజీనామా చేసి హుజూరాబాద్‌కు ఉపఎన్నిక తెచ్చినందునే ప్రభుత్వంలో కదలిక మొదలైంది. హడావుడిగా దళిత బంధు పధకం ప్రకటించి వేలకోట్లు విడుదల చేస్తోంది. సిఎం కార్యాలయంలో తొలిసారిగా దళిత అధికారిని నియమించారు. దళిత, బీసీ నేతలకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారు. ఉన్నత విద్యామండలి ఇన్-ఛార్జ్ ఛైర్మన్‌గా ప్రొఫెసర్ లింబాద్రిని నియమించారు. ఏడేళ్ళలో ఎన్నడూ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయని సిఎం కేసీఆర్ తొలిసారిగా వేశారు. జ్యోతీరావుఫూలేకు దండం పెట్టారు.
నా రాజీనామాతో ఇంతమందికి మేలు జరుగుతుంటే నాకు చాలా సంతోషం కలుగుతోంది. అయితే ఇవన్నీ హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే అని చెప్పక తప్పదు. ఉపఎన్నిక లేకుంటే సిఎం కేసీఆర్ ఇటువంటి ఆలోచనలు చేసేవారు కూడా కాదు. ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ను గెలిపించుకొనేందుకే ఇవన్నీ చేస్తున్నారు.
“హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓడిపోతే మా ప్రభుత్వం పడిపోదు... గెలిస్తే ఢిల్లీలో మాకు అధికారం రాదు...’ అని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడం టిఆర్ఎస్ పార్టీ తన ఓటమిని, నా విజయాన్ని అంగీకరించినట్లే అని భావించవచ్చు. ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా రాదు.
మంత్రి కేటీఆర్...ఈ ఉపఎన్నిక టిఆర్ఎస్‌కు చాలా చిన్నదని అన్నారు. మరి హుజూరాబాద్ నియోజకవర్గంపై గులాబీ దండు ఎందుకు వాలిపోయింది? నెలరోజులుగా మంత్రులు హరీష్‌రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్ నేతలు అందరూ ఇక్కడ ఎందుకు తిష్టవేసారు?” అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.