
శుక్రవారం నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో దళిత బంధు పధకం లబ్దిదారులను గుర్తించేందుకు సర్వే మొదలవుతుంది. ఈ పధకం కోసమే సీఎంఓలో ప్రత్యేక కార్యదర్శిగా నియమితులైన రాహుల్ బొజ్జా నిన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్, జిల్లా అధికారులతో సమావేశమయ్యి చర్చించారు.
అనంతరం రాహుల్ బొజ్జా మీడియాతో మాట్లాడుతూ, “ఈ పధకానికి ప్రధాన అర్హత దళితులైతే చాలు. నియోజకవర్గంలో ప్రతీ దళిత కుటుంబానికి ఈ పధకాన్ని వర్తింపజేస్తాం. దీని కోసం రేపటి నుంచి జిల్లా, మండల స్థాయి అధికారులు మొత్తం 400 మంది ప్రతీ గ్రామంలో పర్యటించి దళిత కుటుంబాల వివరాలను నమోదు చేసుకొంటారు. అక్కడిక్కకడే వారి పేరిట బ్యాంక్ ఖాతాలు కూడా తెరిపించి పాసుపుస్తకాలు అందజేస్తారు. ఈ సర్వే చేస్తున్నప్పుడే ఈ పధకం కింద ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలతో వారు ఎటువంటి వృత్తి, వ్యాపారాలు చేసుకొంటారనే వివరాలను కూడా నమోదు చేస్తారు. రేపటి నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఈ సర్వే నిర్వహిస్తాము. ప్రస్తుతం నియోజకవర్గంలో సుమారు 21 వేల దళిత కుటుంబాలున్నట్లు మావద్ద లెక్కలున్నాయి. ఆ సంఖ్య మరింత పెరిగి ఉండవచ్చు కనుక ఈ సర్వేలో వారి పూర్తివివరాలు సేకరించి ఈ పధకాన్ని అమలుచేస్తాం. అలాగే వారు ఇతర పధకాల కింద ఇదివరకు పొందిన వివరాలను నమోదు చేస్తారు. ఈ పధకాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నందున లబ్దిదారుల ఖాతాలలో డబ్బు జమా చేసినప్పటి నుంచి రెండేళ్ళపాటు వారు దానిని ఏవిధంగా వినియోగించుకొని అభివృద్ధి చెందుతున్నారో పర్యవేక్షిస్తూ, అవసరమైనవారికి సహాయసహకారాలు అందజేస్తుంటాము,” అని చెప్పారు.