
తెలంగాణలో మరో 20 ఏళ్ళు టిఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంటుందని సిఎం కేసీఆర్ నిన్ననే అన్నారు. కానీ మరో రెండేళ్ళలోనే టిఆర్ఎస్ చేతిలో నుంచి అధికారం గుంజుకొందామని బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ అన్నారు. అంతేకాదు రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ పేరును బహుజన భవన్‌గా మార్చి దానిలో డాక్టర్ అంబేడ్కర్, జ్యూతీరావు ఫూలే చిత్రపటాలు పెట్టుకొందామన్నారు. గులాబీ రాష్ట్రం నీలి రాష్ట్రంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
మంగళవారం హన్మకొండ హంటర్ రోడ్డులో బీఎస్పీ ఉమాడి జిల్లా నేతల సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “గత 75 ఏళ్ళుగా మన నేతలు పేదలకు చెందిన లక్షల కోట్లు పందికొక్కుల్లా తిని బతుకుతున్నారు. కనుక దళిత బంధు పేరుతో ఇంటికో పది లక్షలు పంచినా సరిపోదు. ఇంతకాలం వాళ్ళు దోచుకొన్న లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. మన పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బహుజనరాజ్యం వస్తుంది. అప్పుడు మనకు దక్కాల్సినదంతా వెనక్కు తీసుకొందాము. సిఎం కేసీఆర్ 2016లో హన్మకొండకి వచ్చినప్పుడు ఇక్కడ పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టిస్తానని హామీ ఇచ్చారు. కానీ నేటికీ ఇళ్ళు ఇవ్వలేదు. అంబేడ్కర్ నగర్‌లో గుడిసెలు ఖాళీ చేయించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టించారు. కానీ వాటిని లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. ఎందుకు? తెలంగాణలో బహుజన రాజ్యం వస్తే ప్రగతి భవన్ కంటే గొప్ప ఇళ్ళు నిర్మించుకొందాము. ఈ చీదరింపులు, కాలు మొక్కుడు అన్నిటినీ మనమే మార్చాల్సి ఉంటుంది. బీర్లు, బిర్యానీలకు, రాజకీయ నాయకుల కల్లబొల్లి మాటలకు లొంగిపోకుండా నిలబడి మన జాతిని మనమే ఉద్దరించుకోవాలి,” అని అన్నారు.