మంత్రి గంగులకు నకిలీ ఈడీ నోటీస్ జారీ

మంత్రి గంగుల కమలాకర్‌కే టోపీ పెట్టాలని ప్రయత్నించారు మోసగాళ్ళు. ఈడీ పేరిట ఆయనకు, ఆయన సోదరుడికి నోటీసులు పంపారు. గ్రానైట్ కంపెనీల వ్యవహారంలో త్వరలో వారిని అరెస్ట్ చేయబోతున్నామని, అరెస్ట్ వద్దనుకొంటే ఈడీతో మాట్లాడి సెటిల్ చేయగలమని నోటీసులో పేర్కొన్నారు. సాధారణంగా ఈడీ ఏదైనా కేసుకు సంబందించి సంజాయిషీ కోరుతూ లేదా విచారణకు హాజరుకమ్మనమని నోటీసులు పంపిస్తుంది తప్ప అరెస్ట్ చేస్తామంటూ ముందస్తు హెచ్చరికలు, సెటిల్‌మెంట్ చేస్తామని నోటీసులు పంపదు. సరిగ్గా ఇదే ఆ నోటీస్ నకిలీదని తేల్చిచెప్పింది. కనుక మంత్రి గంగుల కమలాకర్‌ అది నకిలీ నోటీసని గుర్తించి పట్టించుకోలేదు కానీ ఈడీ అధికారులు దానిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈడీ పేరుతో మంత్రి గంగులకి కుచ్చు టోపీ పెట్టాలని ప్రయత్నించిన మోసగాళ్లను పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.