తెలంగాణలో అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు

తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు విద్యా, ప్రభుత్వోద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సాయంత్రం జీవో జారీ చేసింది. రూ.8 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కింద ఈ రిజర్వేషన్లకు అర్హులుగా ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో అగ్రవర్ణ మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు జీవోలో పేర్కొంది. ఈడబ్ల్యూఎస్ కోటాలో కూడా ఫీజులు, వయోపరిమితిలో మినహాయింపులు ఉంటాయని పేర్కొంది. 

ఈ రిజర్వేషన్లు పొందేందుకు, విద్యా, ఉద్యోగ దరఖాస్తులతో పాటు తప్పనిసరిగా ఆదాయ దృవపత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పుడు దృవపత్రాలు సమర్పించినట్లు తేలితే కాలేజీ, ఉద్యోగంలో నుంచి తొలగించడమే కాకుండా చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొంది. ఒకవేళ ఒక సంవత్సరంలో ఈడబ్ల్యూఎస్ కోటాలో భర్తీచేయలేకపోతే వాటిని మరుసటి ఏడాదికి బదిలీ చేయబడతాయని పేర్కొంది. కొత్తగా 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో రిజర్వేషన్లు అమలుచేయబోతున్నందున రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలలో ఆ మేరకు సీట్లు పెంచబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.