మరో 20 ఏళ్ళు మనమే అధికారంలో: కేసీఆర్‌

ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. టిఆర్ఎస్‌ అధ్యక్షుడు, సిఎం కేసీఆర్‌ పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మరో 20 ఏళ్ళు రాష్ట్రంలో మనమే అధికారంలో ఉంటాము. హుజూరాబాద్‌ ఉపఎన్నిక మనకి చాలా చిన్న విషయం. దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత దాని గురించి ఆలోచిద్దాం,” అని అన్నారు. 

అనంతరం తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మీడియాకు సమావేశంలో చర్చించిన అంశాలను వివరించారు. ఆ వివరాలు క్లుప్తంగా... 

• సెప్టెంబర్ 2వ తేదీన ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి సిఎం కేసీఆర్‌ భూమిపూజ చేస్తారు.  

• అక్టోబర్ నెలలో 32 జిల్లా కేంద్రాలలో టిఆర్ఎస్‌ పార్టీ కార్యాలయాలను సిఎం కేసీఆర్‌ స్వయంగా ప్రారంభిస్తారు. 

•  సెప్టెంబర్ 2 నుంచి గ్రామస్థాయి, జిల్లాస్థాయి వార్డు కమిటీల పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభింస్తాం. 

• కే.కేశవరావు నేతృత్వంలో పార్టీ సంస్థాగత కమిటీల నియామక ప్రక్రియ సాగుతుంది.  

• సమావేశంలో ఈ రెండు దశాబ్ధాలలో టిఆర్ఎస్‌ విజయ ప్రస్థానం గురించి ప్రధానంగా చర్చించాము.  

• టిఆర్ఎస్‌ స్థాపించి రెండు దశాబ్ధాలవుతోంది కనుక సెప్టెంబర్‌లోగా పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను పూర్తి చేసి అక్టోబర్ లేదా నవంబర్‌ నెలలో ఘనంగా పార్టీ ద్విశతాబ్ది ఉత్సవాలు (ప్లీనరీ సభలు) నిర్వహించాలని నిర్ణయించాము. 

• దళిత బంధు పధకంపై పార్టీలో అందరికీ అవగాహన కల్పించి, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడతాం. 

• ప్రతిపక్షాలు కూడా దళిత బంధు పధకంలో పాలు పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.