
మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సిఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ సంస్థాగత పునర్నిర్మాణంపై ప్రధానంగా చర్చించి షెడ్యూల్ ప్రకటించవచ్చని సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బలపడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నందున ఇప్పటి నుంచే టిఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసుకొని 2023 శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీని సిద్దం చేయడమే ప్రధానోదేశ్యం. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పధకం ప్రయోజనాలు, దాని అమలు, తీరుతెన్నులు, దానిపై ప్రతిపక్షాల విమర్శలు, వాటిని ఏవిదంగా ఎదుర్కోవాలనే అంశాలపై సిఎం కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.