1.jpg)
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడింది. మంగళవారం నుంచి ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ ప్రారంభం కావలసి ఉండగా, బిజెపి సీనియర్ నేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ మృతికి పార్టీ పరంగా నాలుగు రోజులు సంతాపం పాటిస్తుండటంతో బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడింది. సంతాపదినాలు ముగియగానే ఈనెల 28న హైదరాబాద్, పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజలు చేసి పాదయాత్ర మొదలుపెడతారు.
ఈ ప్రజా సంగ్రామ యాత్రలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను బయటపెడతానని బండి సంజయ్ ముందే ప్రకటించడంతో, టిఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒక్క రూపాయి తీసుకురాలేని బిజెపి నేతలు అసత్య ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. అయితే బండి సంజయ్, జి.కిషన్‌రెడ్డిలు పాదయాత్రలు చేసినా మోకాలి యాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు వారిని నమ్మబోరని టిఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు.