మల్లన్నసాగర్ ముంపు గ్రామాలలో విషాదం

సిఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు ఆదివారం తెల్లవారుజామున మల్లన్నసాగర్ జలాశయంలోకి నీటిని విడుదల చేసేందుకు ప్రాజెక్టు అధికారులు సిద్దం అవడంతో, ముంపు గ్రామాలైన ఎర్రవల్లి, వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లె పహాడ్, బి.బంజేరుపల్లిలో శనివారం నుంచి నిర్వాసితులను పోలీసులు బలవంతంగా ఇళ్ళు ఖాళీ చేయించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నష్టపరిహారం విషయంలో కొందరు నిర్వాసితులు అభ్యంతరం చెపుతూ గ్రామాలలోనే ఉండిపోయారు. తమకు భూసేకరణ చట్టం కింద నష్టపరిహారం ఇప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ మల్లన్నసాగర్ జలాశయంలోకి నీటిని విడుదల చేస్తున్నందున వారిని ఖాళీ చేయించకతప్పలేదు. నిర్వాసితుల కన్నీరుమున్నీరుగా విలపించారు.

కొండపాక మండలంలోని ఎర్రవల్లిలో అధికారులు పోలీసుల సాయంతో ఇళ్ళు కూల్చివేస్తున్నప్పుడు ఓ ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి గ్రామంలో ఓ ఇంటిని కూల్చివేస్తున్నప్పుడు, పొక్లెయిన్ యంత్రం పొరపాటున పక్కనే ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా తాకడంతో, ఆ ఇంటి యజమాని ఆరె కనకరాజు (28) అనే యువకుడిపై పడటంతో మరణించాడు. అతని భార్య లక్ష్మి 5 నెలల గర్భిణీ, వారికి ఓ మూడేళ్ళ పాప ఉంది.