
కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండి) నీటిపై 250 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మాణానికి సింగరేణి సంస్థ పూనుకుంది. మానేరు డ్యామ్ పూర్తి విస్తీర్ణం 80 ఒక చదరపు కిలో మీటర్లు ఉండగా దీనిలో 8 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో నీటిపై తేలియాడే సోలార్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. దీంతో కరీంనగర్ ప్రజల కరెంటు కష్టాలు, వేసవి కాలంలో నీటి ఎద్దడి వంటి సమస్యలు తీరనున్నాయి. నీటిపై సోలార్ పలకలు అమర్చడం వలన విద్యుత్ ఉత్పత్తితోపాటు వేసవికాలంలో ఎండకు నీరు ఆవిరి కాకుండా నివారిస్తుందని అధికారులు తెలిపారు.
శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సంస్థ డైరెక్టర్ ఈఎం సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ ప్రాజెక్టు కోసం అనేక కంపెనీలు పోటీ పడుతున్న టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్, టియువి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు, టియువిఎస్ యుడి సౌత్ ఏషియా లిమిటెడ్ ముంబాయి, జెన్స్‌ల్ ఇంజనీర్స్ అహ్మదాబాద్, ఎస్‌యూఆర్ఆర్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పూణే సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇప్పటికే సింగరేణి సంస్థ ఈ ప్రాజెక్టుకి సంబంధించిన సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుమతిస్తే త్వరలోనే పనులు ప్రారంభించాలని సింగరేణి అధికారులు ఎదురుచూస్తున్నారు.